Random Posts

పదవిని ఆశించి కాదు – వ్యవస్థను మార్చాలనే సంకల్పంతో ఎన్నికల రంగంలో నిలవాలి - తుంగా శ్రీ


నేటి రాజకీయ వ్యవస్థను గమనిస్తే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం మసకబారిపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజల భవిష్యత్ కంటే పదవులు, అధికారం, రాజకీయ లాభాలు కొందరి రాజకీయ నాయకుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే, “పదవి వ్యామోహంతో కాదు – మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేవారిని ఆదరించాలి”.

ఎన్నికలు అంటే ప్రజాసేవకు ఒక సాధనం. కానీ నేడు చాలా చోట్ల అవి వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు మారిపోయాయి. రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలపై పోరాటం చేయడం కంటే, ఎవరు ఎలా గెలవాలి? ఎవరిని ఎలా ఓడించాలి? అనే కుట్ర రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల నమ్మకాన్ని పొందడం కంటే, డబ్బు, బలం, భయపెట్టడం, మోసాలు, రెండు నాలుకల ధోరణి మొదలగునవి ఎన్నికల ఆయుధాలుగా మారాయి.

ధర్మం రక్షణకు కాకుండా – రాజకీయ కుట్రే మార్గమా?

ప్రజలు రాజకీయ నాయకుల నుంచి ఆశించే ప్రధాన గుణం ధర్మం. నిజాయితీ, న్యాయం, సమానత్వం, ప్రజల పట్ల బాధ్యత మొదలగునవి. ఇవే ధర్మానికి మూలాలు. కానీ దురదృష్టవశాత్తూ, నేటి రాజకీయాల్లో కేవలం ప్రసంగాలకే పరిమితమైంది కొందరైతే ధర్మం అనే మాటను చాలా సులకనగా చూస్తున్నారు . ధర్మాన్ని రక్షించాల్సిన నాయకులే, కుట్రలను గెలుపుకు మార్గంగా చూస్తున్నారు అన్నది ఒక నిజం.

మార్పు ఎందుకు అవసరం ?

ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు తప్పనిసరి. అదే పార్టీలే, అదే ముఖాలే, అదే హామీలే. ఇవన్నీ ఎన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయినా సమస్యలు అలాగే ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత మొదలగునవి ఇంకా వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి.
అందుకే పదవి కోసం కాదు, మార్పు కోసం ఎన్నికల బరిలోకి దిగే వ్యక్తులు అవసరం. పార్టీ కట్టుబాట్లకు లోబడకుండా, ప్రజలకే జవాబుదారిగా ఉండే నాయకత్వం అవసరం. స్వతంత్రంగా ఆలోచించి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పాలన ఇవ్వగల నాయకత్వమే నిజమైన మార్పుకు పునాది.

ఆదరించండి – మీ ఓటుతో మార్పుకు బలం ఇవ్వండి

ఈ పోరాటం వ్యక్తిగతం కాదు. ఇది ఒక పదవిని సాధించేందుకు చేసే ప్రయత్నం కూడా కాదు. ఇది వ్యవస్థను ప్రశ్నించే ప్రయత్నం, ప్రజల స్వరాన్ని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలనే సంకల్పం తో ప్రజలు ఆలోచిస్తే ఈ మార్పు సాధ్యం.
ఏ ఎన్నికల్లోనైనా మీ ఓటు ఒక వ్యక్తికి కాదు :—
👉 నిజాయితీకి
👉 ధర్మానికి
👉 కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా
ఒక్కసారి ఆలోచించండి. మళ్లీ అవే మాటలు చెప్పే వారిని ఎన్నుకుంటామా? లేక మార్పు కోసం ముందుకు వచ్చే వారిని ఆదరిస్తామా?

ముగింపు

రాజకీయాలు చెడిపోయాయని చెప్పడం సులభం. కానీ వాటిని మార్చే ప్రయత్నం చేయడమే మన నిజమైన బాధ్యత. పదవి వ్యామోహంతో కాదు – మార్పు కోసం ఎన్నికల బరిలో దిగే వారికి మద్దతు ఉండాలి. అది ఒక ప్రతిజ్ఞ మన మనసులో నాటుకోవాలి.
ఈ ప్రతిజ్ఞకు ప్రతి ఒక్కరి ఆదరణ, ప్రతి ఒక్కరి ఓటు, ప్రతి ఒక్కరి విశ్వాసమే బలం గా ఉండాలి. ఎందుకంటే మార్పు ఎవరో చేసి పెట్టరు. మనం కలిసి చేసుకోవాలి.

- తుంగా శ్రీ

📷 Blog లో ఏదైనా image మీద click చేయండి — క్రాప్ బటన్ కనిపిస్తుంది.
✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview