హిందూ ధర్మం అనేది మతం కాదు. అది ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక ఆత్మబంధం. ఈ ధర్మంలో అనేక రూపాలు ఉన్నాయి. విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ విభిన్నత అంతా బయటకు కనిపించే రూపమే లోతుగా చూస్తే అందరి మూలం ఒక్కటే. అది సనాతన ధర్మం.
హిందువుల మధ్య ఉన్న విభిన్నతను బలహీనతగా చూపే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. కానీ నిజానికి అదే విభిన్నత మన బలంగా మారాలి. శైవులు, వైష్ణవులు, శాక్తులు, స్మార్తులు పేర్లు వేరు కావచ్చు, ఆరాధన విధానాలు వేరు కావచ్చు, కానీ ఆరాధ్య తత్వం ఒక్కటే. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనే వేద వాక్యం ఈ సత్యాన్ని స్పష్టంగా చెబుతుంది.
ప్రాంతాల ఆధారంగా చూస్తే, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర భారతం ఇలా ప్రతి చోటా ఆచారాలు మారవచ్చు. భాష మారవచ్చు. కానీ పండుగలలో కనిపించే ఆనందం, దేవాలయాల పట్ల గౌరవం, ధర్మం పట్ల భక్తి మాత్రం ఒకేలా ఉంటుంది. దీపావళి, ఉగాది, సంక్రాంతి, నవరాత్రులు ఇలా పేర్లు, విధానాలు మారినా భావం ఒక్కటే.
“ప్రతి హిందువు మన బంధువు” అన్న భావన కేవలం నినాదం కాదు. అది మన ఆత్మస్వరూపం. సనాతన హిందూ సమాజం ఒక కుటుంబంలాంటిది.
నేటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో హిందువులను విడగొట్టే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో చీల్చే కుట్రలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతి హిందువు తన ధర్మ మూలాన్ని గుర్తించాలి. మనం విడివిడిగా ఉన్నంత కాలం బలహీనంగా ఉంటాం. ఒకటిగా నిలబడితే అపార శక్తిగా మారతాం.
హిందూ ఐక్యత అంటే ఇతరులను ద్వేషించడం కాదు. అది స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకోవడం. మన సంస్కృతిని కాపాడుకోవడం. మన తరాల భవిష్యత్తుకు ధర్మాన్ని వారసత్వంగా అందించడం. ఈ బాధ్యత రాజకీయ నాయకులకు , ప్రతి హిందువుకూ ఉండాలి.
చివరగా చెప్పాలంటే, మన రూపాలు వేరు కావచ్చు, మన ఆచారాలు వేరు కావచ్చు, కానీ మన మూలం ఒక్కటే. ఆ మూలాన్ని గుర్తించిన రోజే హిందూ సమాజం నిజమైన ఐక్యతను సాధిస్తుంది. అప్పుడే “ప్రతి హిందువు మన బంధువు” అన్న మాట నినాదంగా కాకుండా జీవన సత్యంగా మారుతుంది.
- తుంగా శ్రీ